బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం
● రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్
జస్టిస్ ఈశ్వరయ్య
● హాజరైన బీసీ సంఘాల నేతలు
● జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభ
కామారెడ్డి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని రిజర్వేషన్‌ల సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్‌లో శనివారం నిర్వహించిన బీసీ ఆక్రోశ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్స్‌ను 9వ షెడ్యూల్‌లో పెట్టకుండా అడ్డుకుంటున్న బీజేపీపై, బీసీలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న బీఆర్‌ఎస్‌పై, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్‌పై అన్ని వర్గాలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఆ మూడు పార్టీలు స్వార్థ రాజకీయాలు, ఓట్ల కోసం బీసీలను మోసం చేశాయని విమర్శించారు. తమిళనాడులో చట్టబద్ధంగా బీసీలకు 69శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 30, 31బీ ప్రకారం ఉభయ సభల్లో బిల్‌ను పాస్ చేసి, గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, రాజ్యాంగం 9 షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బీసీలకు చట్టప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు. బీజేపీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల బిడ్డలతో సమానంగా పేద, మధ్యతరగతి బిడ్డలకు విద్య, వైద్యం అందినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్లన్నారు. అనంతరం రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీ, బహుజన అభ్యర్థులకు ఓట్లు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
బీసీలను మోసం చేయొద్దు
రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల అమలును బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఉసరవెల్లిలా రాజకీయాల కోసం బీసీలను మోసం చేయొద్దని కోరారు. వైస్ చైర్మన్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్రంలో దళితులు, అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని బాలరాజ్‌గౌడ్, సినిమా డైరెక్టర్ ఎన్ శంకర్, నాయకులు, మర్కంటి భీమన్న, బాలార్జున్‌గౌడ్, సిద్ధిరాములు, పుట్ట మల్లికార్జున్, రమేశ్‌బాబు, వేణుగోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


