1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
● 429 కొనుగోలు కేంద్రాల్లో
ధాన్యం తూకాలు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిజాంసాగర్(జుక్కల్): జిల్లాలోని 429 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణతోపాటు ధాన్యం తూకాలు, ట్యాబ్ ఎంట్రీపై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని సుల్తాన్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నిజాంసాగర్, బంజపల్లి, వెల్గనూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం దిగుబడులు, పెట్టుబడి ఖ ర్చులు, ధాన్యం విక్రయాలకు కల్పించిన సదుపాయాలను తెలుసుకున్నారు. కలెక్టర వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శ్రీ కాంత్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్ భిక్షపతి, వ్యవసాయశాఖ అధికారి అమర్‌ప్రసాద్, హౌసింగ్ డీఈఈ మొగులయ్య, ఐకేపీ ఏపీ ఎం ప్రసన్నరాణి, ఎస్సై శివకుమార్, సొసైటీ సీఈ వో సంగమేశ్వర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్ ఉన్నారు.
ఇసుక తరలింపునకు అనుమతి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని తహసీల్దార్ భిక్షపతికి కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంజీర వాగు నుంచి ఇసుక త రలించేందుకు మూడు మండలాలకు అనుమతులు ఇస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్‌కు తెలిపారు.
గండిమాసానిపేటలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని గండిమాసానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ధాన్యం కాంటా బస్తాకు 42 కిలోలు తూకం వేసినప్పటికీ రైస్‌మిల్ యజమానులు లారీకి 10 నుంచి 12 బస్తాల ధాన్యాన్ని తరుగు పేరుతో తీస్తున్నారని, లేదంటే లారీని వెనక్కి పంపుతామని ఇబ్బంది పెడుతున్నా రని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, కార్యదర్శి విశ్వనాథం ఉన్నారు.
1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ


