ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
● డీఈవో రాజు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఈయేడు జరుగనున్న పదోతరగతి(ఎస్సెస్సీ) వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తామని డీఈవో రాజు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట మోడల్‌స్కూల్‌లో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరం పదోతరగతి పరీక్షలకు ఇప్పటివరకు 12,126మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. కాగా పరీక్షఫీజు చెల్లింపు కోసం ఈనెల 13 వరకు గడువు విధించగా తాజాగా ఫీజు చెల్లింపు తేదీని ఈనెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 64 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతయేడు పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు 96శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నిపాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు సాయంత్రంవేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
ఆదర్శ బడుల్లో అడ్మిషన్లకు పోటీ
జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చక్కని బోధన జరుగుతుందని, ఎన్ని గురుకులాలు వెలిసినా ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు పోటీ తగ్గడంలేదని డీఈవో రాజు అన్నారు. గోపాల్‌పేట ఆదర్శ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఆదర్శపాఠశాలలో విద్యార్థులను సి.వి.రామన్, శకుంతలదేవి, అబ్దుల్‌కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్‌లుగా విభజించడం చాలా బాగుందన్నారు. అనంతరం గత దసరా సెలవుల్లో వృత్తివిద్య కోర్సులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న 22మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తోటివిద్యార్థులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి, ప్రిన్సిపాల్ రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న, హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం


