పెట్రోలింగ్ టెన్షన్
చలి వణికించినా.. వాన దంచి కొట్టినా
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి క్షణం పని చేసే పోలీసులు కొన్ని సందర్భాల్లో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. పని ఒత్తిడిని జయిస్తున్న ఖాకీలు కొన్ని నైట్ పెట్రోలింగ్ వంటి డ్యూటీ అంటేనే ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం వెన్నాడుతున్న యాక్సిడెంట్ ఘటనలే. నైట్ పెట్రోలింగ్ అంటేనే టెన్షన్ పడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● ఖాకీలను వెన్నాడుతున్న యాక్సిడెంట్లు
● ఎనిమిది నెలల్లో
మూడు ఘటనలు
● ఒకరి మృతి..
నలుగురికి గాయాలు
నేరాల నియంత్రణ కోసం చేపట్టే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. దీనికి కారణంగా వరుసగా చోటు చేసుకుంటున్న యాక్సిడెంట్లే. రాత్రి పెట్రోలింగ్ సమయంలో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. డ్యూటీలో ఉన్నపుడు, డ్యూటీకి వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయాలపాలయ్యారు. బుధవారం వేకువజామున 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు తమ వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న కానిస్టేబుల్ సైదయ్య, డ్రైవర్ స్వామిరెడ్డి గాయపడ్డారు. సైదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మార్చి 20వ తేదీన గాంధారి మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ వడ్ల రవికుమార్ దుర్మరణం చెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ నెల 11న మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సుభాష్‌రెడ్డికి గాయాలయ్యాయి. వరుస సంఘటనలతో పోలీసు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. పట్టణాలతోపాటు మండలాల్లోనూ పోలీసులకు నైట్ డ్యూటీలు తప్పనిసరిగా ఉంటాయి. నైట్ పెట్రోలింగ్ లేకుంటే నేరస్తులు రెచ్చిపోతారు. అందుకే అన్ని ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. నైట్ పెట్రోలింగ్ సమయంలో ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
అప్రమత్తంగా ఉంటేనే..
రాత్రి వేళల్లో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడం, దారి దోపిడీలు, హత్యలు, దాడులు.. ఇలా ఎన్నో నేరాలు చీకట్లోనే జరుగుతాయి. అలాగే నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా కూడా రాత్రుల్లోనే జరుగుతుంది. అందుకే నైట్ పెట్రోలింగ్‌లో ఉండే సిబ్బంది నిద్ర ముంచుకొచ్చినా సరే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఉన్నతాధికారులు పెట్రోలింగ్‌ను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతారు. ఏదేని పరిస్థితుల్లో డ్యూటీని పక్కన పెట్టేసి నిద్రపోతున్నా, నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటారు. దీంతో డ్యూటీలో ఉన్న వారు తప్పనిసరిగా పనిచేయాల్సిందే.
రాత్రిపూట పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పో లీసులు చలికాలంలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకుని విధులు నిర్వహించాల్సిందే. అలా వర్షం దంచికొడుతున్నా సరే రెయిన్ కోట్లు ధరించి డ్యూటీ చేయాలి. వాన, చలిని పక్కన పెట్టేసి బాధ్యతలు నిర్వహించాలని అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. ఒక్కోసారి రాత్రుల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఫోన్ రాగానే పరుగులు పెట్టాలి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, వాహనాలు రోడ్డుపై జామ్ అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడం, వాహనాలు ఒకదానికొకటి గుద్దుకుని ఇరుక్కుపోయినపుడు తక్షణ చర్యలు తీసుకోవడంపై దూకుడుగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే డ్యూటీలో ఉన్న సమయంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.
పెట్రోలింగ్ టెన్షన్


