ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
ఆదాయ వనరుల పెంపుపై దృష్టేది..?
ఆదాయ వనరులు పెంచుతాం
బాన్సువాడ : ఆదాయానికి, ఖర్చులకు తేడా ఉండడంతో బాన్సువాడ మున్సిపాలిటీ ఆర్థిక వ్యవహారాల్లో ‘సర్దుబాటు’ తలనొప్పిగా మారింది. ఏడాదికి రూ. 7.80 కోట్ల ఖర్చు ఉండగా, ఆదాయం మాత్రం రూ. 6.50 కోట్ల లోపే ఉంటోంది. మున్సిపాలిటీ పరిధి లోని 19 వార్డుల్లో మొత్తం 10,383 వేల పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.6.50 కోట్లు ఆస్తి పన్ను ద్వారా సమకూరుతున్నాయి. నల్లా కనెక్షన్లు 4,300 ఉంటే బిల్లులు మాత్రం రూ.11 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలవుతున్నాయి. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.6.50 కోట్ల రాబడి వస్తోంది. అయితే డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతా లో జమవుతుండగా ఐదారు నెలలకోసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతోంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు రూ.7.80 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
158 మంది అవుట్‌సోర్సింగ్ కార్మికులు
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 158 మంది అవుట్‌సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి వీరికి వేతనాల కింద ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల డీజిల్‌కు ఏడాదికి రూ.2 లక్షలు, పంప్‌హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వస్తుంది. పైపులైన్‌ల నిర్వహణ, లీకేజీలకు మరమ్మతులకు రూ.2 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.
పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటిని ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మధ్య సిబ్బంది మధ్య సమన్వయలోపంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఆదాయ వనరులను అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేయడం లేదు. అస్తి పన్ను, నల్లాబిల్లులు ద్వారా ఆదాయం దాదాపు రూ.10 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా..ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాల సంఖ్య పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీహరి రాజు, కమిషనర్
బాన్సువాడ మున్సిపాలిటీకి
సరిపోని ఆదాయం
ఖర్చు రూ.7.80 కోట్లు..
ఆదాయం రూ.6.50 కోట్లు
నెలనెలా జమకాని భవనాల
అనుమతుల సొమ్ము
మున్సిపల్ సిబ్బందికి తప్పని
సర్దుబాటు ఇక్కట్లు
ప్రభుత్వం కార్మికులకు వేతనాలు
ఇస్తేనే ఆర్థిక భారం తప్పే అవకాశం


