లింగంపేట(ఎల్లారెడ్డి): ధాన్యం తూకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండలంలోని ఎల్లారం గ్రామాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు ట్యాబ్‌లో నమోదవుతున్నాయా, డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హమాలీలతో మాట్లాడిన కలెక్టర్.. వెంటవెంటనే ధాన్యం తూకం చేస్తూ లారీల్లో లోడ్ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. దశల వారీగా బిల్లులు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్నా అధికారులకు వివరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, హౌజింగ్ ఎంపీడీవో నరేశ్, ఎంపీవో మల్హారి, డీఈ సుభాష్, ఏఈలు రజినీకాంత్, సతీశ్, సృజన్‌కుమార్, యూసుఫ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
ధాన్యం తూకం వేగవంతం చేయాలి


