సోయా రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
బిచ్కుంద(జుక్కల్): వర్షాల కారణంగా కొంత మేర సోయా పంట దెబ్బతిన్నదని, రెండు, మూడు శాతం నాణ్యత లోపించినప్పటికీ రైతులను ఇబ్బందులు పెట్టకుండా పంట దిగుబడిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికారులకు సూచించారు. ఎన్‌సీసీఎఫ్, మార్క్‌ఫెడ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం బిచ్కుంద మార్కెట్ యార్డులో సోయాను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, మార్క్‌ఫెడ్ నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించి దెబ్బతిన్న సోయాను కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీఎఫ్ రాష్ట్ర అధికారి రవిచంద్ర, వినయ్ మహనామ, సర్వేయర్ మహేశ్, మార్క్‌ఫెడ్ ఎండీ శశిధర్‌రెడ్డి, చందు, సొసైటీ చైర్మన్ బాలాజీ, ఏవో అమర్‌ప్రసాద్, సంఘం కార్యదర్శి శ్రావణ్, రైతులు పాల్గొన్నారు.


