నిలిచిన తరగతి గదుల నిర్మాణం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. దీంతో జీప్లస్ వన్ పద్ధతిలో 8 తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు ఉన్నపళంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం 1957లో నిర్మించారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వరకు 109 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వ మన ఊరు మన బడి పథకం కింద కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. భవనం స్లాబ్ పనులు పూర్తి కాగా.. డైనింగ్ హాల్ నిర్మాణం కేవలం పిల్లర్లకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సిపల్‌కు సూచించారు. దీంతో జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించారు. వర్షాలు తగ్గిన తర్వాత శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్ధంతరంగా నిలిచి పోయిన తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన పాఠశాల
గదులలోనే చదువులు
భారీ వర్షాలు కురిసిన సమయంలో జూనియర్ కళాశాల భవనంలో
తరగతుల నిర్వహణ
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
నిలిచిన తరగతి గదుల నిర్మాణం


