న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం
కామారెడ్డి క్రైం: బాధితులకు న్యాయం జరిగితేనే వారికి చట్టంపై విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం స్టేషన్ రైటర్లు, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల రైటర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు అన్ని వివరాలు స్పష్టంగా, సమగ్రంగా, తప్పులు లేకుండా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యతాప్రమాణాలు పాటించడం అత్యంత కీలకమన్నారు. సాక్షుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ప్రతి కేసులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరస్తులకు అనుకూలంగా ఇచ్చే స్టేట్‌మెంట్లు విచారణ నాణ్యతను దెబ్బతీస్తాయన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, జిల్లాలోని అన్ని పీఎస్‌ల రైటర్లు పాల్గొన్నారు.
వేల్పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో అశోక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పచ్చలనడ్కుడ హైస్కూలును గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట పాత్రలను చాలా శుభ్రం చేసి వండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల గురించి హెచ్‌ఎం రమేశ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరాతీశారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: సారంగాపూర్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిగ రవీందర్‌కు ‘హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడని అధ్యాపక సిబ్బంది గురువారం తెలిపారు. ‘కోవిడ్–2019 కాలంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వేబినార్‌లు, కాన్ఫరెన్స్‌లు ఈ–క్విజ్ పోటీలలో రవీందర్ పాల్గొని, 140 ఈ–సర్టిఫికెట్లను పొందారు. అభ్యసనం– విద్యా శ్రేష్టత’కు వారు చేసిన అంకిత భావానికి గుర్తింపుగా హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈసందర్భంగా ఆయనకు ప్రిన్సిపాల్ సాయిలు, అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు.
న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం
న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం


