సోయాలో తేమ 12 శాతం లోపు ఉండాలి
మద్నూర్(జుక్కల్): క్వాలిటీ లేదని సోయాను కొనుగోలు కేంద్రంలో తిరస్కరిస్తున్నారని తెలిసిందని నేషనల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ రవిచంద్ర అన్నారు. మండల కేంద్రంలోని యార్డులో కొనసాగుతున్న సోయా కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర బృందం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయాను విక్రయించాలంటే తేమ శాతం 12 లోపు ఉండాలని, అలాగే మట్టి 2 శాతం కన్నా ఎక్కువ ఉండొద్దని అన్నారు. కానీ అధిక వర్షాలతో సోయాలో 8 శాతం మట్టి ఉండటంతో సోయా రిజెక్ట్ అవుతోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయా పంటను ఎలా అమ్ముకోవాలని, బయటి మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.వెయ్యి నష్టపోతామని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మట్టి శాతం ఎక్కువ ఉన్నందుకు రెండు కిలోల సోయా అదనంగా ఇస్తామని ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌లో తీసుకోవాలని రైతులు కోరారు. అలాగే వేలిముద్రల సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అధికారులకు తెలుపగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నేష్‌నల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు దువ్వ వినయ్, మహేశ్, అధికారులు ఉన్నారు.


