పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సూచించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటీవ్ మేనేజ్‌మెంట్, నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేనేజ్‌మెంట్ ఖర్చుల నిధులను సైతం ఉపయోగించుకుంటూ రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఐసీఎం, ఎన్‌సీడీసీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తనిఖీలు పెంచాలి
అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తమ పరిధిలోని కేంద్రాల్లో తనిఖీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షాసమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి వసతులను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. మూడు నెలలో కాలంలో తనిఖీల సంఖ్య తక్కువగా ఉన్న సూపర్‌వైజర్లు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని ఈడీఎం ప్రవీణ్‌కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో వృద్దాశ్రమం ప్రారంభోత్పవానికి సంబంధించిన ఏర్పాట్లు, అక్కడకు వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


