పేకాటపై పోలీస్ ఫోకస్
నిర్వాహకుల కట్టడి
ప్రత్యేక నిఘా పెట్టాం
● స్థావరాల నిర్వాహకులపై దృష్టి
● పెరుగుతున్న కేసుల సంఖ్య
కామారెడ్డి క్రైం: ‘పేకాట’ సరదాగా మొదలయ్యి ఎంతో మందికి వ్యసనంగా మారుతోంది. పేకాట ఆడే ఒక్కరి కారణంగా కుటుంబం ఆర్థికంగా సర్వం కోల్పోతూ వీధిన పడుతోంది. ఈ నేపథ్యంలో పేకాట నియంత్రణపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థావరాల నిర్వాహకులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేకాట కేసుల సంఖ్య పెరిగింది.
అడ్డాలు మారుస్తూ..
జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మద్నూర్, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, సదాశివనగర్, భిక్కనూరు తదితర ప్రాంతాలు పేకాటకు పెట్టింది పేరు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం పేకాట జోరుగా సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ జూదస్థావరాలు నిర్వహిస్తుంటారు. గతంలో జరిపిన దాడుల్లో ప్రజాప్రతినిధులు సైతం పట్టుబడ్డారు. అయితే, జిల్లాలో నిఘా ఉందనే కారణంతో కొందరు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌లకు వెళ్లి రావడం గమనార్హం.
జిల్లాలో కేసులు..
జిల్లా పోలీసుశాఖ పరిధిలో 3 సబ్ డివిజన్‌లు, 6 సర్కిళ్లు ఉండగా.. వాటి పరిధిలో 23 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. 2023లో 155, 2024లో 207, 2025 ఆగస్టు వరకు 102 పేకాట కేసులు నమోదయ్యాయి.
పేకాటతో వల్ల తలెత్తే అనర్థాలు, జిల్లాలో పరిస్థితిని గుర్తించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు సైతం పేకాటపై నిఘా కొనసాగిస్తున్నాయి. పేకాట ఆడేవారి కన్నా ముందు నిర్వాహకులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. నెల రోజుల క్రితం పిట్లం పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై జరిపిన దాడుల్లో రూ.3.60 లక్షలు పట్టుకోవడంతోపాటు నిర్వాహకుడిని జైలుకు పంపారు.
జూదం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి. పేకాట నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టాం. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.
– రాజేశ్‌చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
పేకాటపై పోలీస్ ఫోకస్
పేకాటపై పోలీస్ ఫోకస్


