బూత్‌స్థాయి ఏజెంట్‌లను నియమించుకోవాలి
కామారెడ్డి క్రైం: బూత్‌స్థాయి ఏజెంట్‌లను నియమించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో సహకారం అందించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు.
మినీ రైస్‌మిల్‌తో ఆర్థిక లాభం..
కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మినీ రైస్‌మిల్ పనితీరును కలెక్టర్ సంగ్వాన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి యూనిట్ లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, మహిళా సంఘాల సభ్యులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ యూనిట్‌లను పరిశ్రమల మాదిరిగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగిల్ ఫేజ్ కరెంట్‌తో నడిచే ఈ మినీ రైస్‌మిల్ గంటకు 250 కిలోల వడ్లను బియ్యంగా చేసి ఇస్తుందని తెలిపారు.
పనులను వేగవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కొనసాగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు అవసరమైన మంచి నీటి వసతిపై మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.


