అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
మద్నూర్: సోయా పంట కొనుగోలులో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోంగ్లి, మద్నూర్ మండల కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధరతో సోయా పంట కొనుగోలు చేయాలని సహకార సంఘాలకు ప్రభుత్వం సూచించింది. అలాగే రైతులకు ఇబ్బందులు కలుగకుండా సోయా కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం సిబ్బందిని ఆదేశించారు. కానీ సోయా పంట కొనుగోలు చేసే అధికారులు బుధవారం రైతులు మార్కెట్ యార్డులో ఉంచిన సోయాను పరిశీలించి పంట బాగాలేదని చాలా మంది రైతుల సోయాను రిజెక్ట్ చేశారు. సోయా పంటకు చెన్ని చేసి పంటను తీసుకోవాలని ఇలా రిజక్ట్ చేస్తే ఎలా అని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పంట తీసుకోకుంటే బయటి మార్కెట్‌లో పంటను విక్రయిస్తే క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోయాలో మట్టి బాగా ఉండడంతోనే రిజక్ట్ చేశామని కొనుగోలు చేసే అధికారులు, సిబ్బంది తెలిపారు.


