రుణం లేదు.. పరికరాలూ లేవు
● ఫలితమివ్వని పీఎం విశ్వకర్మ పథకం
● రుణం, పరికరాలు అందించాలని
లబ్ధిదారుల వినతి
ఎల్లారెడ్డి: కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల వృత్తి నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్షేత్ర స్థాయిలో అనుకున్న ఆశయాలను సాధించడం లేదు. ఈ పథకం కింద కుల వృత్తులైన స్వర్ణకార, వడ్రంగి, మేసిన్, మత్స్యకార, మంగలి, రజక, కంసాలి, టైల్స్ వేయడం, దర్జీ లాంటి కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి వారి వృత్తుల్లో మరింత నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇచ్చి, వారి వృత్తికి ఉపయోగపడే రూ. 15 వేల విలువగల మెరుగైన పరికరాలను అందించాలి. వారి వృత్తి వ్యాపారాల అభివృద్ధికి వ్యక్తిగత పూచీకత్తుపై రూ. లక్ష రుణాన్ని అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వారి రంగాల్లో నిపుణులైన ప్రైవేట్ సంస్థల ద్వారా శిక్షణ ఇచ్చేరే తప్ప సగానికి పైగా దరఖాస్తుదారులకు రుణాలు అందలేదు.
అలాగే రుణాలు అందిన వారిలో చాలా మందికి ఈ పథకం కింద ఇవ్వాల్సిన వృత్తి పరికరాలు లభించలేదు. కామారెడ్డి జిల్లాలో విశ్వకర్మ పథకం కింద గతేడాది 4,711 మందికి శిక్షణ ఇవ్వగా 1,927 మందికి రూ. లక్ష రూపాయల రుణం లభించింది. రుణం లభించిన వారిలో 1,394 మంది లబ్ధిదారులకు వారి కుల వృత్తుల పరికరాలు లభించాయి. మిగితా వారికి కేవలం శిక్షణ మాత్రమే లభించింది. ఈ పథకం కింద ఇస్తామన్న రూ. లక్ష రుణం, వృత్తి పరికరాలు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్నకు ఏ అధికారి సరైన వివరణ ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
రుణం లేదు.. పరికరాలూ లేవు


