ఇంటి బిల్లు ఇప్పించమని ప్రార్థన..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాను నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించాలని కోరుతూ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ అనే వితంతు బుధవారం తన ఇంటిపై ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిసిన వెంటనే తాను బేస్మెంట్ నిర్మాణం చేపట్టానని, ఆ తరువాత తర్వాత పంచాయతీ కార్యదర్శితోపాటు ఇతరులు వచ్చి బేస్మెంట్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చి మంజూరుపత్రం అందజేశారని తెలిపింది. నూతనంగా నిర్మించిన బేస్మెంట్ పైనే మార్కింగ్ ఇవ్వాలని తాను కోరినప్పటికీ అధికారులు పక్కనే ఉన్న తన సోదరులకు సంబంధించిన ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చారని ఆమె వాపోయింది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అప్పటికే నిర్మించుకున్న బేస్మెంట్‌పై, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కొలతల ప్రకారమే పనులు చేపట్టానని తెలిపింది. ఇంటినిర్మాణం కోసం తాను సుమారు రూ.7లక్షల వరకు అప్పు చేశానని, భర్తను కోల్పో యి ఒంటరి మహిళగా ఉన్న తనకు ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ఆమె కోరుతోంది.
నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటి..
గ్రామంలోని మంగలి ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మాట వాస్తవమేనని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా మార్కింగ్ ఇచ్చిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న స్థలంలో ఇదివరకు నిర్మించిన బేస్మెంట్‌పై ఈశ్వరమ్మ ఇంటినిర్మాణం చేపట్టారన్నారు. దీంతో ఆమెకు ఇందిరమ్మ ఇంటిబిల్లులు చెల్లించే అవకాశం లేదని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు.


