అటవీ భూమిని చదును చేసిన గిరిజనులు
● పది మందిపై కేసు నమోదు
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గన్నారం బీట్ మెగ్యా నాయక్ తండాలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను ధ్వంసం చేసి భూమి చదును చేసిన పదిమంది గిరిజనులపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్ బట్ తెలిపారు. అనుమతులు లేకుండా అడవులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
● ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు
కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో డయల్–100కు పలుమార్లు ఫోన్ చేసి విసిగించిన యువకుడికి కామారెడ్డి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షేక్ అమీర్ అనే యువకుడు మంగళవారం తనకు ఎలాంటి అత్యవసరం లేకపోయినా డయల్–100 కు పదే పదే ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతడికి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ నిందితుడికి రూ.వెయ్యి జరిమానా, ఒక రోజు జైలు శిక్ష విధించింది. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.
నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన నీరడి శ్రీను(42) అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. ఉపాధి నిమిత్తం దుబాయి నుంచి వచ్చిన శ్రీను కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో గొడవలు జరగడంతో గత నెల 26న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియరాలేదు. శ్రీను భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బీబీపేట: మద్యానికి బానిసైన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోడ సునీల్(30) కొన్ని రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యం తాగేవాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం వీరి మధ్య మరోసారి గొడవ కావడంతో సునీల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతని కోసం వెతుకుతుండగా మల్కాపూర్ గ్రామ శివారులో గడ్డిమందు తాగి కిందపడిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బోధన్: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరా లు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్‌కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతా ప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
అటవీ భూమిని చదును చేసిన గిరిజనులు


