సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి
మద్నూర్(జుక్కల్): సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం పంట కొనుగోళ్లు షురు చేస్తామని చేయకపోగా మంగళవారం నాఫెడ్ అధికారులు పంటను పరిశీలించి కొనుగోళ్లను ప్రారంభించారు. కానీ చాలా మంది రైతుల సోయా పంట నాణ్యత లేదని, పంట రంగు మారిందని, మట్టి ఎక్కువగా ఉందని, తేమ శాతం రావడం లేదని నాఫెడ్ అధికారులు చెప్పగా రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బాగున్నా, ఎందుకు అడ్డంకులు చెబుతున్నారని వారు ప్రశ్నించారు. పంట కొనుగోలులో ఆలస్యం జరుగుతుండటంతోపాటు అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరి సోయా పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): విద్యుత్ వైర్లను ఇళ్లపై నుంచి తొలగించాలని గాంధీనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి పలువురి ఇళ్లపై పడడంతో కాలనీవాసులు భయందోళనకు గురయ్యాయారు. దీంతో కాలనీవాసులు ఇళ్లపై నుంచి వైర్లను వెంటనే తొలగించాలని కోరారు. వైర్లను ఇళ్లపై నుంచి తొలగించే వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదన్నారు. అనంతరం గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ఉదయం నుంచి విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.


