ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
బిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ బిచ్కుందని, దీనిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులలో నాణ్యతా ప్రమాణాలు, పనులు సజావుగా జరగడం, పట్టణ అభివృద్ధిపై అఖిల పక్షం నాయకులు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులపై అవగాహన లేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిని పట్టించుకోవద్దని కోరారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయం పక్కన పెట్టి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్లి ఎవరికీ నష్టం జరగకుండా వేగంగా రోడ్డు పనులు చేయాలని సూచించారు. రోడ్డుపై దుమ్ము వస్తుందని వ్యాపారులు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీళ్లతో క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్, డీఈ వినోద్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, వివిధ శాఖల అధికారులు, నేతలు పాల్గొన్నారు.


