కొనసాగుతున్న జన్మదినోత్సవాలు
● నేడు కాలభైరవుడి డోలారోహణం
● సాయంత్రం బండ్ల ఊరేగింపు
రామారెడ్డి (ఎల్లారెడ్డి): మండలంలోని కాలభైరవుడి ఆలయంలో స్వామివారి జన్మదినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడరోజు సంతత ధారాభిషేకం కొనసాగింది. ఆలయానికి భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఆరు గంటలకు సంతతధారాభిషేకం పరిసమాప్తి అవుతుంది. అనంతరం మధ్యాహ్నం డోలారోహణం (తొట్లే) నిర్వహించనున్నారు. స్వామివారి కిలో బంగారు విగ్రహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చి తొట్లలో వేసి డోలారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


