మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు
● డ్రంకెన్ డ్రైవ్‌లో పలువురికి
జైలు, జరిమానా విధింపు
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 24 మంది పట్టుబడినట్లు తెలిపారు. కోర్టుకు హాజరుపరుచగా బాలక్రిష్ణ, తిరుపతి రెడ్డి అనే ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా, మిగితా 22 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సోమవారం టౌన్ పీఎస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
తాడ్వాయిలో ఇద్దరికి జైలు..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. సోమవారం తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. కన్‌కల్ గ్రామానికి చెందిన ఏలేటి బాలురెడ్డి, సంగోజివాడికి చెందిన దుడ్డెల ప్రవీన్ అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కామారెడ్డిలోని కోర్టులో హాజరుపరచగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ వారికి ఒక రోజు జైలు శిక్ష , రూ.1000 చొప్పున జరిమాన విధించారు.


