అసలే అక్రమం.. ఆపై రాజకీయం
నేతల పేర్లు వాడుకుంటూ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రోస్టర్ పాటించకుండా అడ్డదారిలో నియామకమైన తెలంగాణ వర్సిటీ అధ్యాపకులు.. క్యాంపస్‌లో కొత్త రాజకీయాలకు తెరతీశారు. 2014లో కేసు కోర్టులో ఉన్న సమయంలోనే ఉద్యోగంలో నియామకమయ్యేటప్పుడు కోర్టు తీర్పునకు కట్టుబడతామని సదరు అధ్యాపకులు రాసిచ్చారు. తీరా ఇప్పుడు హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసినప్పటికీ తమను ఎవరూ ఏంచేయలేరన్నట్లుగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ వర్సిటీకి వస్తున్న ఆ 45 మంది అధ్యాపకులు తాజాగా మరో నీచ రాజకీయానికి బీజం వేశారు. ఎన్‌ఎస్‌యూఐ పేరిట తమకు అనుకూలంగా వర్సిటీలో ఆందోళన చేయించారు. ఇలా చేసిన కొద్ది సేపటికే దానిని ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న నవీన్‌కు యూనియన్‌తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ కమిటీలో పనిచేసినవారెవరూ ప్రస్తుతం అందుబాటులో లేనందున కొత్త కమిటీని నియమించలేదన్నారు. 2012 నోటిఫికేషన్ మీద హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆయా అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ చేసిన ఆందోళనకు ఎన్‌ఎస్‌యూఐకి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభు త్వం ఉన్న సమయంలో అప్పటి తెయూ వీసీ అక్బ ర్ అలీఖాన్ చేసిన అక్రమ నియామకాలపై ఆ ప్రభు త్వం రెండు కమిటీలు వేసింది. ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు రెండు కమిటీ లూ నివేదికలు ఇవ్వగా తరువాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం సదరు నివేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ అధ్యాపకుల నియామకాలను, వీళ్లకు ప్రమోషన్లు ఇచ్చే విషయమై పాలకమండలి ప్రతిసారి తిరస్కరిస్తూ వ చ్చింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు అధ్యాపకులు కీలక నేతలను బదనాం చేసే పనిలో బిజీగా ఉండడం విశేషం. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కొందరు బ్యూరోక్రాట్లు ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తుండడం గమనార్హం.
కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న అక్రమ అధ్యాపకులు అధికార పార్టీ నాయకుల ప్రతిష్టనూ దెబ్బతీసే పని చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్లను కూడా వాడుతున్నారు. అధికార పార్టీ అండ తమకుందంటూ వర్సిటీలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించేందుకు కుయుక్తులు పన్నిన ఈ అధ్యాపకులు ఏకంగా ప్రభుత్వంలో, అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతనూ బదనాం చేస్తుండడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తగినవిధంగా ముందుకు వెళ్లేందుకు వీసీ యాదగిరిరావు సంసిద్ధం అవుతున్నప్పటికీ రిజిస్ట్రార్ యాదగిరి మాత్రం కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అడుగడుగునా అడ్డదారులు వెతుకుతున్న అక్రమ అధ్యాపకులు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థి
సంఘాలను భ్రష్టు పట్టించే యత్నం
అధికార పార్టీ నేతలనూ బదనాం చేస్తున్న వైనం
ఎన్‌ఎస్‌యూఐ పేరిట ఆందోళన
చేయించడంతో..
ఖండిస్తూ ఆ సంస్థ ప్రకటన


