సోయా కొనుగోళ్లలో కొర్రీలు
● కొత్తగా బయోమెట్రిక్ విధానం అమలు
● ఎకరానికి 7.50 క్వింటాళ్లు
మాత్రమే సేకరణ
● ఆందోళనలో రైతులు
బిచ్కుంద : ఆరుగాలం శ్రమించే రైతన్నలు.. దున్నకాలనుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఏడాది సోయా కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్ కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. గతంలో పట్టాదారు ఆధార్ కార్డును తీసుకునివచ్చి కుటుంబ సభ్యులెవరైనా పంటను విక్రయించడానికి అవకాశం ఉండేది. కానీ నూతన విధానం ప్రకారం పాస్‌బుక్‌లో పేరున్న రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి వచ్చి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అలాగే క్రాప్ బుకింగ్ సమయంలో సోయా పంటను పండిస్తున్నట్లు వివరాలు ఇస్తేనే పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే.
మిగతా పంటను ఏం చేయాలి?
కొనుగోలు కేంద్రాలలో ఎకరానికి 7.5 క్వింటాళ్ల సోయాలను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీరు నిలువ ఉండని సారవంతమైన భూములలో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగతా పంటను ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దళారులను చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్!
సోయా కొనుగోళ్లలో దళారులకు చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకు వచ్చినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కొంటున్నారు. పాత పద్ధతిలో దళారులు ఎక్కడి నుంచో సోయాలను తీసుకునివచ్చి రైతు పేరుతో విక్రయించి లబ్ధిపొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్త విధానంతో పట్టాదారు మాత్రమే కొనుగోలు కేంద్రంలో పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే వృద్ధులు, మహిళా రైతులు, అనారోగ్యంతో ఉన్న వారు కొనుగోలు కేంద్రం వరకు వచ్చే పరిస్థితి ఉండదని, వారు పంటను ఎలా విక్రయించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఎకరానికి ఆరునుంచి పది క్వింటాళ్ల వరకు సోయా పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మిగిలిన సోయాలను ఎక్కడ అమ్ముకోవాలి. పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి.
– యాదవరావు, రైతు ఫత్లాపూర్
సోయా కొనుగోళ్లలో కొర్రీలు


