కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టెర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08468 –220051 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీసీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో సురేందర్, డీఏవో మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌కు సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం సందర్శించారు. రికార్డులు, తీసుకుంటున్న భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, డిప్యూటీ తహసీల్దార్‌లు రవి, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.


