భూసేకరణను వేగవంతం చేయాలి
● రైతులకు త్వరగా పరిహారం
చెల్లించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రహదారుల భూసేకరణ పనులపై సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డి మార్గంలో జరుగుతున్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్–765డీ) ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు చేపట్టాల్సిన రహదారి పనులకు గాను భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహా రెడ్డి, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


