లింబాద్రి గుట్టపై గుండెపోటుతో భక్తుడి మృతి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆదిలాబాద్‌కు చెందిన పోలకొండ శ్రీనివాస్‌వర్మ(47) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం లింబాద్రి గుట్టకు చేరుకున్నాడు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రి కొండపై బస చేశారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా అతడికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు రోదిస్తూ వర్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
పేకాడుతున్న 8 మంది అరెస్టు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జలాల్‌పూర్, కన్నారెడ్డి శివారుల్లో పేకాట ఆడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు జలాల్‌పూర్‌లోని పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.13,308 నగదును, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా మండలంలోని కన్నారెడ్డి కల్లుకాంపౌండ్‌లో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారి నుంచి రూ.4,160 నగదుతోపాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.


