కోర్టు ధిక్కారమా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 2012లో రోస్టర్ పాటించకుండా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వర్సిటీలో చేసిన అధ్యాపక నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా అడుగడుగునా కోర్టు ధిక్కార ధోరణితో వెళుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోర్టులో పిటిషన్ దాఖలయ్యాక నియామకపత్రాలు తీసుకున్న అధ్యాపకులు ఆ సమయంలో కోర్టు తీర్పునకు లోబడతామని రాసిచ్చారు. తీర్పు వచ్చాక దానిని ఉల్లంఘిస్తున్నారు. మరోవైపు ఈ అధ్యాపకుల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసును పట్టించుకోకుండా కథ నడిపించడం గమనార్హం. ఈ వ్యవహారంలో సుమారు రూ.5 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాగా రాష్ట్రస్థాయిలో పనిచేసిన ఓ ఉన్నతాధి కారి ఒక్కరికే గతంలో రూ.1.5 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు రిజిస్ట్రార్ మధ్యవర్తిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే గతంలో పాలకమండలి అడ్డుపడడంతో ఈ ప్రమోషన్ల వ్యవహారానికి బ్రేక్ పడుతూ వచ్చింది. కాగా పాలకమండలి పదవీకాలం పూర్తికావడంతో గతే డాది కాలంగా ప్రమోషన్ల ఫైలును మరింత స్పీడ్‌గా కదిపేందుకు రిజిస్ట్రార్ గట్టి ప్రయత్నాలు చేస్తూ రావడం విశేషం. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కేసుతో ఈ కేసును పోల్చి పదోన్నతులు కల్పించే కుట్ర చేయడం గమనార్హం. పాలకమండలి లేకపోవడంతో గతంలో ఉన్నత విద్యాశాఖలో కీలకంగా ఉన్న ఓ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఈ ఫైలుపై సంతకం చేసి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసు తీవ్రత కప్పిపెట్టి ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని లీగల్ ఒపీనియన్ పేరిట ఒక లేఖ సృష్టించడం విశేషం. విద్యాశాఖ న్యాయ నిపుణుల నుంచి కాకుండా వేరే విభాగానికి చెందిన న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇందుకు రూ.2 లక్షల ప్రభుత్వ (యూనివర్సిటీ) సొమ్ము ఖర్చు పెట్టినట్లు సమాచారం.
లీగల్ ఒపీనియన్ పేరిట..
అనేక ఆరోపణల నేపఽథ్యంలో 2012 ఏడాది చివరిలో అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, 2013 ఫిబ్రవరి లో నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్నవాళ్లను జాయిన్ చేసుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సదరు నియామకాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నియామకాల్లో అక్రమాలపై విద్యార్థి సంఘాలు సాక్ష్యాలను బయటపెట్టాయి. ఎంపిక కాని అర్హులు కొందరు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం, ఇక్కడే పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం స్పందించి ఈ నియామకాలపై సమగ్ర విచారణ జరిపేందుకు 2013 ఫిబ్రవరి 22న ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఏప్రిల్‌లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నియామకాలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువరించవద్దని ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే సమయంలో అటు అకడమిక్ కన్సల్టెంట్లు సైతం ఈ నియామకాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రోజురోజుకూ వివాదాస్పదంగా తయారైంది. ఈ విషయమై జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికపై అప్పటి గవర్నమెంట్ ప్లీడర్ (ఉన్నత విద్యాశాఖ) వాణిరెడ్డి ద్వారా లీగల్ ఒపీనియన్ కోరుతూ 41వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నియామకాలపై జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పాలకమండలి, ఆయా నియామకాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించింది. నియామకాలు చేపట్టిన అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ అశోక్‌లపై ఉస్మానియా యూనివర్సిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వర్సిటీకి లేఖ రాయాలని తెలంగాణ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి సభ్యులు ఆదేశించారు. అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ పెన్షన్ బెనిఫిట్స్‌ను పూర్తిగా నిలిపేయాలని, అశోక్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను ఉస్మానియా వర్సిటీ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. జస్టిస్ సీవీ రాములు నివేదిక ప్రకారం అక్బర్ అలీఖాన్, అశోక్‌లపై సత్వరమే క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ వర్సిటీ వీసీ సాంబయ్య, రిజిస్ట్రార్ బలరాములును పాలకమండలి ఆదేశించింది.
● ప్రభుత్వ ప్లీడర్ వాణిరెడ్డి ఒపీనియన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ నియామకాలను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని కోరుతూ 2014 నియామక అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని అప్పటి వీసీ, రిజిస్ట్రార్‌లను పాలకమండలి ఆదేశించింది. ఇలా ప్రతి పాలకమండలి సమావేశంలో తిరస్కరణకు గురైన వివాదాస్పద నియామకాలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి ఏవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకునేలా ఒప్పించారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి లీగల్ ఒపీనియన్ తీసుకునేముందే పాలకమండలి అనుమతి కోరారు. మరి ఇప్పుడు పాలకమండలిని ఎందుకు మరిచారో, పూర్తిస్థాయిలో పాలకమండలి లేని సమయంలో ఆగమేఘాల మీద లీగల్ ఒపీనియన్‌కు ఎందుకు పంపారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 మార్చి 30న జరిగిన 44వ పాలకమండలి సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తర్వాత తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ వివాదాస్పద 2014 అభ్యర్థులు పెట్టుకున్న వినతిని 48వ పాలకమండలి సమావేశం తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2014 నియామకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ నుంచి 2022 జూలై 13న లేఖ వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
హైకోర్టు తీర్పును లెక్కచేయని వైనం
తెయూ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు
ప్రమోషన్ల ఫైలును కదిలించేందుకు
పలుమార్లు యత్నం
గతంలో అనేకసార్లు తిరస్కరిస్తూ చేసిన
పాలకమండలి తీర్మానాల బేఖాతరు


