తనిఖీలు ముమ్మరం!
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిత్యం వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల తాండూరు సమీపంలో టిప్పర్, బస్సు ఢీకొన్న సంఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత కూడా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. జాతీయ రహదారులపైనా ఫోకస్ చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాలతో గురువారం రాత్రినుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎన్‌హెచ్–44పై భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై అంజనేయులుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ఎనిమిది బృందాలుగా 1,139 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో 27 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. నిజామాబాద్‌నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్ తాగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను వేరే వాహనాల్లో తరలించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాగి వాహనాలను నడపకుండా చూసేందుకు హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తామన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరంతో పాటు ప్రాణాలతో ఆడే ప్రమాదకరమైన ఆట. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, ట్రక్కులు, లారీలు, కార్ల డ్రైవర్లు వాహనాలను నడిపేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించకూడదు. తాగి నడిపడం వల్ల నడిపేవారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం ఉంది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నారు. కోర్టులో జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. దీంతో తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం చాలా మందిలో ఏర్పడింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించిన ప్రతీచోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు. తాగి వాహనం నడిపిన వారు తప్పించుకోలేకపోతున్నారు. తాగి నడిపిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, జరిమానాలు విధించడంతోపాటు కోర్టు ద్వారా జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటుండడంతో తాగి వాహనం నడపడానికి పలువురు వెనకాడుతున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
పోలీసుల చర్యలు
భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్
ఒక్క రాత్రే 1,139 వాహనాల తనిఖీ
తాగి వాహనం నడిపినవారిపై
కేసులు నమోదు
తనిఖీలు ముమ్మరం!


