మక్కలు కొనేదెప్పుడు?
వ్యాపారులకు అమ్ముకున్న
భిక్కనూరు: రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్రాలలోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని పాలకులు చెబుతుంటారు. అయితే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తూకాల మాట ఎత్తకపోవడంతో విసిగిపోతున్న రైతులు.. వ్యాపారులకే పంటను అమ్ముకుంటున్నారు. దీంతో మద్దతు ధరకు దూరమవుతున్నారు.
భిక్కనూరు మండలంలో సుమారు 800 ఎకరాలలో మొక్కజొన్న పండించారు. పంట కొనుగోలు కోసం ప్రభుత్వం మండలంలోని అంతంపల్లి, బస్వాపూర్ సింగిల్‌విండోలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గతనెల 22 న అంతంపల్లి సింగిల్‌విండోలో మార్క్‌ఫెడ్ అధికారి చందు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకువచ్చి, క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర పొందాలని సూచించారు. అయితే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రెండు వారాలు కావస్తున్నా.. ఇప్పటికీ కొనుగోళ్ల జాడ లేదు. రైతులు వెళ్లి అడిగితే రెండు మూడు రోజులు ఆగాలన్న సమాధానం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలనుంచి వస్తోంది. తేమ శాతం 14లోపు ఉండాలంటున్నారని, కానీ అకాల వర్షాలతో మక్కలను ఆరబెట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. కాలయాపన జరుగుతుండడంతో రైతులు విసిగిపోయి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు క్వింటాలుకు రూ. 1,950 నుంచి రూ. 2 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.
పంట చేతికొచ్చి నెలరోజులు
కొనుగోలు కేంద్రాల
ప్రారంభోత్సవంతోనే సరి
తూకాల జాడ కరువు
దళారులకు అమ్ముకుంటున్న రైతులు
పట్టించుకోని అధికారులు
నేను నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ మక్కల కొనుగోళ్లు ప్రారంభించలేదు. రెండు మూడు రోజులు ఆగాలంటూ కాలయాపన చేస్తున్నారు. పది రోజులు ఓపిక పట్టిన. ఇప్పట్లో కొనెటట్లు లేరని 80 క్వింటాళ్ల మక్కలను క్వింటాలుకు రూ. 1980 చొప్పున వ్యాపారులకు అమ్ముకున్న.
– తాటిపల్లి సిద్దరాములు, రైతు, తిప్పాపూర్
మక్కలు కొనేదెప్పుడు?


