కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

Aug 5 2025 7:15 AM | Updated on Aug 5 2025 7:15 AM

కారు,

కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

వేల్పూర్‌: మండలంలోని లక్కోర వద్ద 63 నెంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై సంజీవ్‌ మంగళవారం తెలిపారు. అంక్సాపూర్‌ నుంచి ఆర్మూర్‌కు ఆటోను ఆర్మూర్‌ నుంచి మోర్తాడ్‌ వైపు కారులో వెళ్తున్న జలందర్‌ అనే వ్యక్తి అతివేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న లింబాద్రి, ముత్తెన్నలకు బలమైన గాయాలైనట్లు పేర్కొన్నారు. లింబాద్రి కొడుకు నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పొలంలో పడి ఒకరి మృతి

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పొలంలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంతోష్‌ రామ్‌(35) తన భార్యతో కలిసి గోవింద్‌పేట్‌లో నివాసముంటూ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పొలం పని చేస్తుండగా మూర్ఛ రావడంతో బోర్లాపడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరు..

బోధన్‌: ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ శివారులో పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సిరిగంధపు శ్రీనివాస్‌(36) నీటమునిగి మృతి చెందాడు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చేపలు పట్టేందుకు వెళ్తున్నానని తండ్రికి చెప్పాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో సోమవారం చెరువులో ఆచూకీ కోసం వెతికారు. మధ్యాహ్న సమయంలో శ్రీనివాస్‌ మృతదేహం చెరువులో నీటిపై తేలింది. చేపల వల కాళ్లకు చుట్టుకొని, ఈత రాక నీటమునిగి మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

ఆర్మూర్‌టౌన్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌(41) గత శుక్రవారం ఆలూరు మండలం మచ్చర్ల శివారులో బైక్‌పై వెళ్తుండగా అడవి పండి ఢీకొని కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రవీణ్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం చికిత్స పొందుతూ ప్రవీణ్‌ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదు

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న గణేశ్‌ అనే లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థిని పట్ల లెక్చరర్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలియడంతో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ సదరు కళాశాలలో నిరసన తెలిపి నిర్వాహకులను నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళా ఎస్సై విచారణ చేపట్టగా లెక్చరర్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తేలింది. పోలీసులు లెక్చరర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీజీవీపీ నాయకుడు కల్యాణ్‌ కళాశాల ఎదుట ధర్నా చేశారు.

కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
1
1/1

కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement