డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలు | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలు

Jul 11 2025 6:29 AM | Updated on Jul 11 2025 6:29 AM

డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలు

డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలు

ఖలీల్‌వాడి: నగరంలో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి గురువారం ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ నగరంలోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం నగరంలోని కోర్టులో సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో ఏడుగురికి రూ. 11500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురిలో ఒకరికి ఒకరోజు, ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

న్యూసెన్స్‌ కేసులో ఒకరికి..

ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి మద్యం అతిగా తాగి న్యూసెనన్స్‌ చేసిన ఒకరికి జిల్లా కోర్టు ఏడు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన షేక్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తి మద్యం అతిగా తాగి నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం స్పెషల్‌ సెకండ్‌ క్లాస్‌ జడ్జి నూర్జహాన్‌ ఎదుట హాజరుపర్చారు. జడ్జి అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడిని జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

తల్లిని హతమార్చిన కొడుకు

పింఛన్‌ డబ్బుల కోసం ఘాతుకం

వర్ని: పింఛన్‌ డబ్బుల కోసం తల్లిని కొడుకు హతమార్చిన ఘటన మండలంలోని జలాల్పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్‌ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయిలుకు గతంలోనే వివాహం జరుగగా భార్య అతడిని వదిలి, పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో సాయిలు అతడి తల్లి సాయవ్వ(60) ఉంటున్నారు. మద్యానికి బానిసైన సాయిలు తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. తల్లికి ఈనెల పింఛన్‌ డబ్బులు రావడంతో వాటిని తనకు ఇవ్వాలని సాయిలు గురువారం మధ్యాహ్నం ఘర్షణకు దిగాడు. తల్లి ససేమిరా అనడంతో అతడు బండరాయిని తీసుకొని తల్లిపై కొట్టగా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్‌ వెల్లడించారు.

బస్వాపూర్‌లో ఒకరి ఆత్మహత్య

భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై దత్తు గురువారం తెలిపారు. బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కందూరి లింగం(55) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై, తరచు భార్య, పిల్లలతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి అతడు అతిగా మద్యం తాగి, ఇంటికి వచ్చి బోజనం చేసి పడుకున్నాడు. కుటుంబీకులు గురువారం ఉదయం లేచిచూడగా అతడు ఇంటి వెనుక ఉన్న స్లాబ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

పొదుపు డబ్బులు స్వాహా!

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ బీపీఎం నిఖిత పొదుపు డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేసినట్లు తెలిసింది. సదరు బీపీఎం మూడు నెలల పాటు సెలవుపై వెళ్లడంతో ఇటీవల ఇన్‌చార్జి బీపీఎంగా శశికాంత్‌ పోస్టాఫీస్‌కు వచ్చాడు. అయితే ప్రతి నెలా ఆర్డీ డబ్బులు బీపీఎం నిఖితకు ఇవ్వడంతో ఖాతాబుక్కుల్లో వారికి రాసి ఇచ్చింది. డబ్బులు జమ చేసేందుకు ప్రజలు పోస్టాఫీస్‌కు రావడంతో ఇన్‌చార్జి బీపీఎం ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా తేడాలు కన్పించాయి. ప్రతి నెలా డబ్బులు కట్టినట్లు బుక్కుల్లో రాసి ఉన్నా ఆన్‌లైన్‌ నమోదు చేయకుండా స్వాహా చేసిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసం స్థానికులు ఎస్‌పీఎం, బీపీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement