
‘ఉపాధి’లో పారదర్శకత కోసం విజిలెన్స్ కమిటీలు
బిచ్కుంద(జుక్కల్): ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా చేపట్టేందుకు విజిలెన్స్ కమిటీలు వేస్తున్నామని, ప్రతి నెలా పనులను కమిటీ తనిఖీ చేస్తుందని ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ నిర్మల, పీడీ సురేందర్ అన్నారు. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో 2024–25 ఈజీఎస్ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో రూ.2 కోట్ల 35 లక్షల విలువైన పనులకు అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారన్నారు. ఈజీఎస్ పనులు పర్యవేక్షణ కోసం త్వరలోనే ప్రభుత్వం విజిలెన్ కమిటీలు ఏర్పాటు చేయనుందని, అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో చేపట్టిన కొన్ని పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, మస్టర్లలో తప్పులున్నాయని సోషల్ ఆడిట్ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తామని పీడీ స్పష్టం చేశారు. క్వాలిటీ కంట్రోల అధికారులు రాఘవన్, విప్లవకుమార్, ఎంపీడీవో గోపాల్ తదితరులు పాల్గొన్నారు.