
ఎత్తిపోతలకు మళ్లీ తాళం
● భారంగా పథకం నిర్వహణ
● పేరుకుపోయిన రైతుల పన్ను బకాయిలు
● ప్రధాన పంప్‌హౌస్‌లో ప్యానెల్ బోర్డు సామగ్రి చోరి
● ఆయకట్టు రైతుల్లో ఆందోళన
బోధన్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది పై నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మళ్లీ తాళం ప డింది. ఏడాదిన్నర క్రితం దుండగులు ఈ పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి తీగలు, ఆయిల్‌ను అపహరించారు. దీంతో పంప్‌హౌస్‌కు తాళం వేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో రూ.10 లక్షలు మంజూరు చే యించి ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టడంతో పథకం వినియోగంలోకి వచ్చింది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు ఎత్తిపో తల పథకం ప్రధాన పంప్‌హౌస్‌లో కరెంట్ మో టార్ల ప్యానెల్ బోర్డు అపహరణకు గురైంది. దీంతో లిఫ్ట్‌కు మళ్లీ తాళం పడింది. నిర్వహణ కమిటీ వద్ద డబ్బులు లేకపోవడంతో మరమ్మతులో జాప్యం జరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.
2009లో పథకం ప్రారంభం
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎత్తిపోతల పథకానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తిచేసి 2009లో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలను స్థిరీకరించారు. వర్షాధార మెట్ట భూములు సస్యశ్యామలమయ్యాయి. ఈ పథకాన్ని రైతులు ఐక్యతతో సద్వినియోగం చేసుకోవడంలో సఫలమై లబ్ధిపొందారు. సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల కోసం రైతులు మాగాణి ఎకరానికి రూ.800, మెట్ట ఎకరానికి రూ.600 చొప్పున పథకం కమిటీకి చెల్లిస్తారు. రైతులు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి.
దిగువకు మంజీర జలాలు
ఏటా వర్షాకాలం ప్రారంభంలో మంజీర నదిలో వరద నీరు చేరగానే లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి గ్రామ శివారులోని చెరువులను నింపుతారు. ఈసారి నెల క్రితమే మంజీరలో వరద నీరు చేరినా మోటార్లు సిద్ధంగా లేకపోవడంతో దిగువకు కదలిపోతున్నాయి. ప్రస్తుతం గ్రామ శివారులోని ఏడు చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. చెరువుల కింద కరెంట్ బోరుబావులున్న రైతులు మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న వందలాది ఎకరాల వర్షాధార మెట్ట భూముల్లో ప్రధానంగా సోయా మొలకెత్తింది. ఈ విషయమై సంఘం చైర్మన్ అల్లె జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా రైతుల సహకారంతో పథకం ప్రారంభానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.