
పంటకు లేదు ‘ధీమా’!
కామారెడ్డి క్రైం: అధిక వర్షాలు, వరదలు, అకాల వర్షాలు, వడగండ్లు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో ఏటా పంటలకు నష్టం వాటిల్లుతూనే ఉంది. దీంతో అన్నదాతలు నష్టపోతున్నారు. పంటలకు బీమా లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
జిల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 5.24 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రధాన పంటగా వరి 3 లక్షలకుపైగా ఎకరాలలో సాగు కానుంది. ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో 32,552 ఎకరాల్లో మక్క, 51,802 ఎకరాల్లో సోయా, 17,713 ఎకరాల్లో పత్తి, 6,965 ఎకరాల్లో కంది, దాదాపు 35 వేల ఎకరాల్లో వరి వేశారు.
2017–18 వరకు రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలును నిలిపివేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు బీమా అందకుండాపోయింది. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరిపింది. బీమా కంపనీలతో సంప్రదింపుల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈసారి కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పంటల బీమా విషయంలో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో 18,212 మంది రైతులకు సంబంధించిన 10,328 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రూ. 16 కోట్ల పరిహారం విడుదల చేసింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు మరింత మేలు జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
బీమా పథకాన్ని
విస్మరించిన ప్రభుత్వం
అకాల వర్షాలు, వరదలతో
ఏటా దెబ్బతింటున్న పంటలు
నష్టపోతున్న రైతన్నలు
సమాచారం లేదు..
పంట నష్టం జరిగిన ప్రతిసారి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తున్నాం. బీమా పథకాన్ని అమలు చేయడంపై ఇప్పటివరకై తే మాకు ఎలాంటి సమాచారం రాలేదు. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.
– తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి

పంటకు లేదు ‘ధీమా’!