
పోక్సో చట్టంపై అవగాహన
బాన్సువాడ: పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు బుధవారం ఎస్సై మోహన్ అవగాహన కల్పించారు. పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు. నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. మహిళల కోసం షీటీం అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వర్‌రావు, షీటీం సభ్యులు అనిల్, సాయిలు తదితరులు ఉన్నారు.
సైబర్ నేరాలను పసిగట్టాలి
మద్నూర్(జుక్కల్): సైబర్ నేరాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడాలని ఎస్సై విజయ్ కొండ సూచించారు. డోంగ్లీ మండల కేంద్రంలో బుధవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సైబర్ నేరాలను గుర్తించాలని కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
కారు, ఆటో ఢీ..
నలుగురికి తీవ్రగాయాలు
నస్రుల్లాబాద్ : మండలంలోని దుర్కి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 765డీ రోడ్డుపై బుధవారం దుర్కి నుంచి బాన్సువాడ వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అతి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని పీఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
మద్నూర్(జుక్కల్): మండలంలోని కోడిచిర గ్రామశివారులో బుధవారం విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందినట్లు బాధిత రైతు బేతే సంజు తెలిపారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో మేత కోసం వెళ్లిన ఆవుకు తగిలి అక్కడికక్కడే మరణించింది. ఆవు విలువ రూ.35 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.
పేకాడుతున్న నలుగురి అరెస్ట్
మద్నూర్(జుక్కల్): మండలంలోని కోడిచిరలో పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. కోడిచిరలో పేకాడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై బుధవారం దాడి చేసి నలుగురితోపాటు రూ.1,670 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోక్సో చట్టంపై అవగాహన