
అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి
ఆర్మూర్‌టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన పూజ(27)కు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి చెందిన సాయిలుతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు రష్మిత ఉండగా, రెండు నెలల క్రితం కొడుకు పుట్టాడు. భర్త సాయిలు నెల రోజుల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కాగా, మంగళవారం సాయంత్రం ఇంట్లో గొడవ జరగడంతో అత్త నర్సవ్వ, మరిది అశోక్, ఆడపడుచు శైలజ రాత్రి పూజను తీవ్రంగా కొట్టినట్లు కూతురు రష్మిత తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త సాయిలు, అత్త నర్సవ్వ, ఆడపడుచు శైలజ, మరిది అశోక్ వేధింపులకు గురి చేస్తుండేవారని పూజ కుటుంబీకులు ఆరోపించారు. పూజ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వడ్డెర కాలనీకి చేరుకున్నారు. తమ కూతురును అత్తింటి వారే కొట్టి చంపారని, వారిని తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. ఉద్రిక్తతల నడుమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.
అత్తింటి వారే కొట్టి చంపేశారని కుటుంబీకుల ఆరోపణ
తీవ్ర ఉద్రిక్తత.. భారీ పోలీస్ బందోబస్తు

అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి