
వేధింపులు భరించలేక కొడుకును హత్య చేశాడు
ఏఎస్పీ చైతన్య రెడ్డి
కామారెడ్డి క్రైం: జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం నిత్యం వేధించడంతోనే సొంత కొడుకును తండ్రి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన వడ్ల నిఖిల్ (24) హత్య కేసులో నిందితుడైన తండ్రి భాస్కర్‌ను రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో కుమార్తెకు పెళ్లి చేశారు. కొడుకు నిఖిల్ జులాయిగా తిరుగుతుండటంతో ఏడాది క్రితం గల్ఫ్‌కు పంపారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వచ్చేశాడు. వచ్చిన నాటి నుంచి గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఏపనీ చేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో పలుసార్లు తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. గత ఆదివారం రాత్రి గొడవ జరిగినప్పుడు భాస్కర్ అక్కడే ఉన్న ఓ కర్రతో నిఖిల్ తలపై కొట్టాడు. బలమైన గాయం కావడంతో వెంటనే కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చారు. నిఖిల్ బతికి ఉంటే తమను ప్రశాంతంగా ఉండనివ్వడని భావించిన తండ్రి భాస్కర్ అతడిని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. సోమవారం వేకువజామున రాడ్డుతో మరోసారి నిఖిల్‌పై దాడి చేశాడు. తీవ్రగాయాలైన నిఖిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగానే చనిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న భాస్కర్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని అభినందించారు.