
ఇటుక బట్టీలో వలస కార్మికుల గుర్తింపు
కామారెడ్డి రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేయించుకుంటున్న యజమానిపై అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం కింద కేసు నమోదైంది. కామారెడ్డి మండలం గూడెం గ్రామ శివారులో మెస్సర్స్ కేకేఎస్ ఇటుక బట్టీపై బుధవారం దాడి చేసినట్లు సహాయ కార్మిక శాఖ కమిషనర్ ఎం కోటేశ్వర్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ఒడిశా వలస కార్మికులు పన్నెండు మందిని బట్టీలో గుర్తించామన్నారు. వారిని విచారించగా తాము సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం యజమానిని విచారించగా కార్మికులను తిరిగి వాళ్ల స్వగ్రామాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు ఇప్పించి కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాడిలో సహాయ కార్మిక అధికారి, సయ్యద్ కమ్రుద్దీన్, తహసీల్దార్ జనార్దన్, దేవునిపల్లి ఎస్సై రాజు, బాలల పరిరక్షణ అధికారిని జే స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రానికి పంపిన అధికారులు
యజమానిపై కేసు నమోదు