
గిరి పుత్రులకు సౌర జల వికాసం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆర్‌వోఎఫ్‌ఆర్–2006 యాక్ట్ ద్వారా పోడు పట్టాలు ఇచ్చిన భూములను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పోడుపట్టాలు పొందిన రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. భూమి అభివృద్ధి, బోరు/బావి తవ్వకం, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు పంటల సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించనున్నారు. ఈ పథకంలో ఏడాదికి కొంత మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులందరికీ సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఐదేళ్ల కాలంలో జిల్లాలో 6,492 మంది గిరిజనులకు సంబంధించి 13,346 ఎకరాల భూమికి అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఈ ఏడాది జిల్లాలో 308 మంది రైతులను ఎంపిక చేయనున్నారు. గిరిజన రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నారు.
జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు
కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా రవాణా అధికారి, జిల్లా హార్టికల్చర్ అధికారి, విద్యుత్ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, జిల్లా పంచాయతీ అధికారి, రెడ్‌కో డీఎం తదితరులు సభ్యులుగా ఏర్పాటయ్యే కమిటీ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పర్యవేక్షించనుంది. మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉండి క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక నుంచి పనులు పూర్తయ్యేవరకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పోడు పట్టాలు పొందిన రైతులందరి భూముల్లో జలసిరులు కురిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. పోడు పట్టాలు రావడంతో అటవీ శాఖ అధికారుల వేధింపులు చాలావరకు ఆగిపోయాయి. పోడు పట్టాలు పొందిన రైతులను ఆదుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పోడు భూములను అభివృద్ధి చేసి పంటల సాగుకు అనుకూలంగా తయారుచేస్తారు. భూగర్భ జల శాఖ ద్వారా సర్వే నిర్వహించిన అనంతరం బావులు/బోర్లు తవ్విస్తారు. బోర్లకు, బావులకు మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్యానెల్స్ బిగిస్తారు. అనంతరం ఆ భూముల్లో హార్టికల్చర్ పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతులను సమాయత్తం చేయనుంది. పోడు పట్టాలు పొందిన రైతులు నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
పోడు భూముల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక వివరాలు..
సంవత్సరం రైతులు ఎకరాలు
2025–26 308 850
2026–27 1,546 3,124
2027–28 1,546 3,124
2028–29 1,546 3,124
2029–30 1,546 3,124
మొత్తం 6,492 13,346
ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిన
పోడు భూముల అభివృద్ధికి చర్యలు
ఐదేళ్ల ప్రణాళిక
ఖరారు చేసిన ప్రభుత్వం
జిల్లాలో 6,492 మంది రైతులు,
13,346 ఎకరాల భూమి..
ఈ ఏడాది 308 మందికి అవకాశం