
‘తొలకరి’కి ముందే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంకా రోహిణి కార్తె రానే లేదు.. ఎండాకాలం పోనేలేదు.. జిల్లాను వరుణుడు పలకరించాడు. మండు వేసవిలో నిండుగా కమ్ముకొచ్చిన కారు మేఘాలు జిల్లా అంతటా విస్తారంగా వర్షించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బుధవారం ఉదయం కూడా వాన దంచికొట్టింది. సాయంత్రం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. సాధారణంగా జూన్ రెండో వారం దాటిన తర్వాత తొలకరి జల్లులు పలకరిస్తాయి. అయితే అకాల వర్షాలు, తుపాన్లతో మరింత ముందుగా వానలు కురుస్తుండడంతో తొలకరి ముందుగానే వచ్చిందని రైతులు సంతోషపడుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌పై అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముందుగానే కురుస్తున్న వర్షాలతో దుక్కులు సిద్ధం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారం పది రోజులుగా అకాల వర్షాలు కురిసి ఇప్పటికే నేల నానింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో మరింతగా భూమి నానిందని రైతులు అంటున్నారు. కాగా కొన్నిచోట్ల ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. అవి తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు(మి.మీటర్లలో)..
నమోదు కేంద్రం వర్షపాతం
తాడ్వాయి 40.0
కామారెడ్డి 34.5
ఆర్గొండ 34.3
ఎల్పుగొండ 32.8
ఇసాయిపేట 31.3
రామారెడ్డి 29.5
సదాశివనగర్ 26.0
పెద్దకొడప్‌గల్ 21.8
రామలక్ష్మణపల్లి 21.8
భిక్కనూరు 20.5
పాత రాజంపేట 19.3
బీర్కూర్ 17.3
నస్రుల్లాబాద్ 16.5
బిచ్కుంద 13.8
బొమ్మన్‌దేవ్‌పల్లి 13.5
మేనూరు 13.0
పిట్లం 13.0
బీబీపేట 12.8
డోంగ్లీ 12.0
జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలు
సాగు పనులకు
సన్నద్ధమవుతున్న రైతులు

‘తొలకరి’కి ముందే..