
ఎరువులను అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి క్రైం: ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల బెడద రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి ఎక్కువగా సాగు చేసే జుక్కల్ నియోజకవర్గం పరిధిలో నకిలీ విత్తనాలు రాకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల 193 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వాటి వివరాలను సమర్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఈ యేడాది 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు జరిగేలా చూడాలన్నారు. ఇందుకుగాను ప్రణాళికలు సిద్దం చేయాలని, నివేదికలు సమర్పించాలని అధికారులను అదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన ఫాంపాండ్స్, నీటి సంరక్షణ పనులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఏడీఏలు, ఏవోలు, హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్