
‘నారి శక్తి’కి వందనం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందు కు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయా న్ని మహిళలు స్వాగతిస్తున్నారు. దశాబ్దాల కల సాకారమవుతోందని పేర్కొంటున్నా రు. అయితే పేరుకు మహిళలకు సీట్లిచ్చి పెత్తనం కుటుంబ సభ్యులు చేసే పరి స్థితి ఉండకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
● చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
● లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
● హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా నేతలు
● పొలిటికల్ సర్కిళ్లల్లో ఇదే అంశంపై చర్చ
స్థానిక సంస్థల్లో
యాభై శాతం మహిళలే..
స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో 22 మండలాలకుగాను 11 మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు మహిళలు కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల ‘ఆయన’ పెత్తనమే నడుస్తున్నా.. ఇంకొన్నిచోట్ల మహిళా ప్రజాప్రతినిధులు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా దఫేదార్ శోభ ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మహిళలు తమ వాణిని వినిపిస్తున్నారు. లింగంపేట జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి తదితరులు ప్రతిసారి సమావేశాల్లో సమస్యలను లేవనెత్తుతూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. మరికొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఆయా సమావేశాల్లో తమదైన వాణి వినిపిస్తూ సత్తా చాటుతున్నారు.
సాక్షి, కామారెడ్డి: జనాభాలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. పాలనలోనూ చాలామంది తమదైన ముద్ర వేస్తున్నారు. సర్పంచ్ నుంచి మొదలుపెడితే దేశ ప్రధాని, రాష్ట్రపతి దాకా ఎంతో మంది తమ సత్తా చాటారు. అయితే చైతన్యం ఉన్నా అవకాశం దొరక్క చాలామంది మహిళలు ముందుకు వెళ్లలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలవుతుండడంతో ఎంతోమంది మహిళలు స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇటీవలి పరిణామాలు ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తున్నాయి. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. చట్టంగా మారితే ఈసారి కాకుంటే తర్వాతి ఎన్నికల్లోనైనా రిజర్వేషన్లు అమలవుతాయన్న భరోసా ఏర్పడింది.
జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నాలుగు చోట్ల పురుషులకన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అప్పుడెప్పుడో ఎల్లారెడ్డి ని యోజకవర్గం నుంచి మహి ళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించగా, జుక్కల్‌లో పాలించే అవకాశం ఒక్కసారి మాత్రమే దొరికింది. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో మహిళలకు పోటీ చేసే అవకాశాన్ని ఇప్పటివరకు ఏ పార్టీ ఇవ్వలేదు. రిజర్వేషన్లు కల్పిస్తేనే అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతున్న మహిళలు.. దశాబ్దాలుగా అనేక పోరాటాలు నిర్వహించారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినపుడల్లా ఆందోళనలు నిర్వహించడం, కొంత కాలానికి పక్కకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడంతో మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
స్త్రీ ఓటర్లే ఎక్కువ..
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పురుషులకన్నా మహిళా ఓటర్లు ఏడు వేల పైచిలుకు ఎక్కువగా ఉన్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడలలోనూ మహిళా ఓటర్లు ఏడు వేలపైనే ఎక్కువున్నారు. జుక్కల్‌లో మూడు వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొంది, అమల్లోకి వస్తే జిల్లాలో కనీసం ఒక్క నియోజకవర్గమైనా మహిళలకు రిజర్వ్ అవుతుందని భావిస్తున్నారు.
చర్చనీయాంశం..
మహిళా రిజర్వేషన్‌లపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మా రింది. ఫలానా నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందంటే.. కాదు ఫలానా నియోజకవర్గం అవుతుందని వాదించుకుంటున్నారు. ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే ఎక్కడ ఎవరు బరిలో నిలుస్తారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు పోటీకి ఆసక్తి చూపవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.
నియోజక వర్గాలవారీగా ఓటర్ల వివరాలు
