ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్‌కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు క్షేమంగా బయటపడే మెళకువలను బస్సులో ప్రయాణికులకు వివరించారు. మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.


