సహకారాలు.. మిరియాలు | - | Sakshi
Sakshi News home page

సహకారాలు.. మిరియాలు

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

డీసీసీబీలో నామినేటెడ్‌ చిచ్చు

గత ఏడాది చైర్మన్‌ నియామకం

ఇప్పటి వరకూ డైరెక్టర్ల ఊసే లేదు

మండిపడుతున్న ఆశావహులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ.. అధికారమే పరమావధిగా.. పదవులే పరమార్థంగా.. పరస్పర ప్రయోజనాల కోసం ఎన్నికల్లో సహకరించుకున్న కూటమి నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆశించిన పదవులు దక్కకపోవడంతో అగ్రనేతలపై వారు కారాలు, మిరియాలు నూరుతున్నారు. కూటమిని గద్దెనెక్కించేందుకు రేయింబవళ్లు పార్టీ జెండాలు భుజాన మోశామని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల పందేరంలో ప్రాధాన్యం ఇస్తామంటే నిజమేననుకున్నామని.. తీరా చూస్తే ఇప్పుడు మొండిచెయ్యి చూపిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్‌ పదవులపై ఆశ పెట్టుకున్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఏం జరిగిందంటే..

కాకినాడ కేంద్రంగా ఉన్న డీసీసీబీ సుమారు రూ.6 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌తో నడుస్తోంది. దీని పరిధిలో 298 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఉన్నాయి. ఇవి సుమారు నాలుగైదు లక్షల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సుమారు 2.90 లక్షల మంది రైతులు ఖాతాదారులుగా ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న డీసీసీబీ చైర్మన్‌గా జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు)ని గత ఏడాది జూలై నెలలో నామినేట్‌ చేశారు. వాస్తవానికి ఈ పదవి కోసం టీడీపీలోనే తీవ్ర స్థాయిలో పోటీ జరిగింది. అయితే, జిల్లాలోని పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో.. పదవుల పందేరంలో జనసేనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై డీసీసీబీ చైర్మన్‌ పదవి ఆశించి, భంగపడిన తెలుగు తమ్ముళ్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయినప్పటికీ వారి విన్నపాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ పదవిని జనసేనకే చంద్రబాబు కట్టబెట్టారు.

ఊరించి.. ఉసూరుమనిపించి..

మరోవైపు పీఏసీఎస్‌లకు గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించ లేదు. ప్రత్యామ్నాయంగా కూటమి పార్టీల నేతల్లో ఒకరు చైర్మన్‌గా, మరో ఇద్దరు సభ్యులుగా త్రీమెన్‌ కమిటీలను నియమించింది. వీరి నుంచి కూడా తమకు డీసీసీబీ నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. ఈ నియామకాలు జరగకపోవడంతో డీసీసీబీలో ప్రతి ఆరు నెలలకోసారి జరిగే పాలకవర్గ సమావేశంలో పీఏసీఎస్‌ల స్థాయిలో ఇవ్వాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక పంట రుణాలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులిస్తామని రెండేళ్లుగా ఊరించి, చివరకు ఉసూరుమనింపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణ కర్తవ్యంపై మూడు పార్టీల్లోని ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు.

నెలలు గడుస్తున్నా...

డీసీసీబీలో చైర్మన్‌ కాకుండా 10 నుంచి 20 మందిని డైరెక్టర్లుగా నియమించే చాన్స్‌ ఉంది. చైర్మన్‌గా తుమ్మల బాబు నియామకం జరిగి దాదాపు 10 నెలలు కావస్తోంది. కానీ, ఇప్పటి వరకూ ఒక్కరిని కూడా డీసీసీబీలో డైరక్టర్‌గా నియమించలేదు. దీనిపై కూటమి మూడు పార్టీల్లోని ఆశావహులు మండిపడుతున్నారు. పాలకవర్గంలో బెర్త్‌ కోసం ఆశల పల్లకీలో ఊరేగిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చైర్మన్‌ పదవి దక్కిన తరువాత డైరెక్టర్ల నియామకంపై తుమ్మల బాబు కనీసంగా కూడా దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

డీసీసీబీ పాలకవర్గ సభ్యులుగా నియమిస్తామంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు తమకు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని అసంతృప్తివాదులు కన్నెర్ర చేస్తున్నారు. చైర్మన్‌ను నియమించి, డైరెక్టర్లను నియమించకుండా చేతులు దులిపేసుకుంటారా అని మూడు పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జనసేన కోటాలో చైర్మన్‌ నియమించేస్తే సరిపోతుందా? టీడీపీ, బీజేపీల్లోని ఆశావహుల పరిస్థితేమిటో ఆలోచించనవసరం లేదా అని పార్టీ నేతలను క్షేత్ర స్థాయిలో నిలదీస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవిని ప్రతి ఆరు నెలలకోసారి రెన్యువల్‌ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రెన్యువల్‌ చేశారు. కానీ, డైరెక్టర్లను నియమించడానికి మాత్రం చంద్రబాబుకు చేతులు రావడం లేదని ఆశావహులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూటమిలోని మూడు పార్టీల నుంచి డజను మందికి పైగా ఆశావహులు డీసీసీబీ డైరెక్టర్‌ పదవులను ఆశిస్తున్నారు. వారందరూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల లేఖలతో సిఫారసులు కూడా చేయించుకున్నారు. ఆ లేఖలు ఇచ్చినా, పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement