ఊరంతటికీ వంటిల్లు | - | Sakshi
Sakshi News home page

ఊరంతటికీ వంటిల్లు

Mar 8 2026 7:30 AM | Updated on Mar 8 2026 7:30 AM

గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన అడపా అమ్మాజీ, ఆమె కుమార్తె ఎర్రంశెట్టి దేవి కలసి కొన్నేళ్లుగా పిండి వంటలు చేసే పనిని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. వీరు తయారు చేసిన మిఠాయిలు, ఇతర పిండి వంటలను వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో, ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా.. ప్రతి రోజూ 10 నుంచి 15 మంది వరకూ మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. దుర్గాభవాని మహిళా శక్తి సంఘం డ్వాక్రా గ్రూపు నుంచి రుణం పొందిన వీరు రెండేళ్ల క్రితం క్యాటరింగ్‌ రంగంలోకి అడుగు పెట్టారు. పండగ సమయంలో ఆర్డర్‌ ప్రకారం రకరకాల పిండివంటలు తయారు చేస్తారు. అంతేకాదు.. ఒకప్పుడు పొట్టకూటి కోసం చిన్నచిన్న జంతికలు తయారు చేసి అమ్ముకున్న వీరు.. ఇప్పుడు ఏకంగా వివిధ రకాల పిండి వంటలు, రుచికరమైన భోజనాలు కూడా సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు ఈ ఇంట్లోనే తయారు చేస్తూంటారు. శుభకార్యాలతో పాటు పండగలకు సైతం బూరెలు, గారెలు, చలివిడి, లడ్డూలు, వడియాలు, సున్నుండల వంటి పిండి వంటలు ఎక్కువ మంది ఇక్కడి నుంచే కొనుగోలు చేయడం విశేషం. వివాహాది శుభకార్యాలకు స్వయంగా వండి, రుచికరమైన భోజనాలు సరఫరా చేస్తున్నారు. అందుకే ఆ ఊరంతటికీ ఆ ఇల్లే వంటిల్లుగా పేరొందింది. ఇంట్లో పండగలకు వండుకునే వంటలే ఇప్పుడు తన వ్యాపారంగా మారిందని, తాను తయారు చేసే పిండి వంటలు నచ్చడంతో అందరూ తనవద్ద కొనుగోలు చేస్తున్నారని అమ్మాజీ తెలిపారు. గతంలో ఇంటి వద్దనే అమ్మేవారమని, రెండేళ్లుగా కొనుగోలుదార్లు ఎక్కువగా వస్తూండటంతో కొంత మంది మహిళలను పెట్టుకుని వంటలు వండుతూ సరఫరా చేస్తున్నామని చెప్పారు. పిండి వంటలతో పాటు భోజనాలు కూడా తయారు చేసి ఇవ్వాలని అడుగుతూండటంతో క్యాటరింగ్‌ కూడా ప్రారంభించామని తెలిపారు. చిన్నప్పుడు మాకు.. ఇప్పుడు అందరికీ వండి పెడుతున్న మా అమ్మకు చేదోడుగా తాను కూడా ఇదే పని చేస్తున్నానని అమ్మాజీ కుమార్తె ఎర్రంశెట్టి దేవి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement