తప్పుడు కేసులకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులకు భయపడేది లేదు

Mar 8 2026 7:30 AM | Updated on Mar 8 2026 7:30 AM

న్యూస్‌రీల్‌

కాకినాడ రూరల్‌: తప్పుడు కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తిమ్మాపురం శివాలయం వద్ద చోటు చేసుకున్న వివాదంలో కేవలం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి విదితమే.

ఈ కేసులో సబ్‌ జైలులో రిమాండులో ఉండి బెయిల్‌పై విడుదలైన తిమ్మాపురం సర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణను పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు తదితరులతో కలసి రాజా శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా శివాలయం వద్ద జరిగిన సంఘటనను సత్యనారాయణ వివరించారు. పోలీసులు తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 10 మందిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారని చెప్పారు. రాజా మాట్లాడుతూ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులు మానుకోవాలని, ఒక వర్గానికి కొమ్ము కాయడం పోలీసులకు సరికాదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement