కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వండి
● సంక్షేమ పథకాలు అమలు చేయండి
● అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్
● కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, తమకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ దీక్షలను కలెక్టరేట్ వద్ద సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని అన్నారు. ఇదే సమయంలో ధరలు వందల రెట్లు పెరిగాయని, ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకు రూ.7 వేలు, టీచర్‌కు రూ.11,500 మాత్రమే చెల్లిస్తూ, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రం ప్రభుత్వోద్యోగులుగా నమోదు చేశారని, ఆ సాకుతో తమకు అన్ని సంక్షేమ పథకాలనూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల మాదిరిగా అంగన్‌వాడీలకు కూడా పీఆర్‌సీ వర్తింపజేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో విద్యనందించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ తీసుకువచ్చి పని ఒత్తిడి పెంచిందని అన్నారు. ఐసీడీఎస్ నిధులు తగ్గిస్తూంటే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడం మానుకోవాలని, 2019లో నిర్ణయించిన మెనూ చార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగులో పెట్టిన 168 సూపర్‌వైజర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, బాలింతలకు ఇచ్చే బియ్యం, పప్పు, ఆయిల్ నాణ్యతను పెంచాలని డిమాండ్ చేశారు.


