విద్యుత్ స్తంభం పడి సైక్లిస్టు మృతి
మామిడికుదురు: మండలం పెదపట్నంలంకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్ స్తంభం విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కుల వృత్తి చేసుకునే మానేపల్లి శ్రీమన్నారాయణ (65) రెండు వివాహాల నిమిత్తం అవిరేడు కుండలు ఇచ్చి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా గిడుగువారిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా స్తంభం విరిగి శ్రీమన్నారాయణపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి గొల్లమందల నాగరాజు పరుగులు పెట్టడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రీమన్నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు మానేపల్లి దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అందరితో అప్యాయంగా ఉండే శ్రీమన్నారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
విద్యుత్ షాక్‌తో..
అంబాజీపేట: కొబ్బరికాయల దింపునకు కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందంపూడి గ్రామానికి చెందిన నేదునూరి జనార్దనరావు (55) బుధవారం కొబ్బరికాయలు దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతున్నాడు. కొబ్బరిచెట్టుకు సమీపంలో విద్యుత్ వైర్లపై ఉన్న ఎండు కొబ్బరి ఆకు జనార్దనారావుకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై చెట్టుపైనే విగతజీవిగా వేలాడిపోయాడు. జనార్దనరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రిజర్వాయర్‌లో మునిగి..
గంగవరం: మతి స్థితిమితం లేని ఓ వృద్ధురాలు సూరంపాలెం రిజర్వాయర్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై వెంకయ్య బుధవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు మండలం మొల్లేరు గ్రామానికి చెందిన చొప్పా కృష్ణవేణి (70) చిన్నతనం నుంచి మతి స్థిమితం లేక పలు చోట్లకు నడిచి వెళ్లిపోతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె సూరంపాలెం రిజర్వాయర్ నీటిలో మునిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం తేలినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి ఆమెను గుర్తించి మొల్లేరు గ్రామస్తురాలిగా నిర్ధారించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వాహనం ఢీకొని..
రంగంపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందినట్టు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కోటపాడు శివారు రామేశంపేట వద్ద బిక్కవోలు వెళ్లే దారిలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు చెప్పారని తెలిపారు. కోటపాడు ఇంచార్జి వీఆర్‌ఓ పుప్పాల రుద్రమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
విద్యుత్ స్తంభం పడి సైక్లిస్టు మృతి
విద్యుత్ స్తంభం పడి సైక్లిస్టు మృతి


