సై.. సై.. శయ్యారే! | - | Sakshi
Sakshi News home page

సై.. సై.. శయ్యారే!

Feb 22 2026 7:15 AM | Updated on Feb 22 2026 7:15 AM

సై..

సై.. సై.. శయ్యారే!

పందిరి మంచాలకు పెరుగుతున్న క్రేజ్‌

మారిన ట్రెండ్‌తో పూర్వ వైభవం

తయారీకి పెరిగిన ప్రాధాన్యం

పిఠాపురం: ఇల్లయినా కార్యాలయమైనా ఫర్నిచర్‌ ఉండాల్సిందే. అలసి సొలసిన దేహానికి కాసింత విశ్రాంతిని అందించేందుకు మంచాలు, కుర్చీలు ఎంతో అవసరం. వీటన్నింటిలోనూ మంచాలకు ఉన్న విలువ ఫర్నిచర్‌లో ఇక దేనికీ ఉండదు. మనిషి జీవితంలో సగ భాగం గడిపేది మంచం మీదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచాలకు పూర్వకాలం నుంచీ మంచి గుర్తింపు ఉంది. ట్రెండ్‌ మారుతున్న కొద్దీ మంచాల్లో అనేక రకాల డిజైన్లు మార్పులు వచ్చినప్పటికీ పందిరి మంచానికి ఉన్న ఆదరణ చెక్కుచెదరనిది. గతంలో పందిరి మంచం లేని ఇల్లు ఉండేది కాదు. రానురానూ మారిన కాలంతో పాటు మంచాలు మారిపోయాయి. పందిరి మంచం పాత కాలపు వస్తువుగా మిగిలిపోయింది. కానీ, ప్రస్తుతం మారిన ట్రెండ్‌తో మళ్లీ పందిరి మంచాలకు పూర్వ వైభవం వస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పందిరి మంచాలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో, వీటి తయారీ అమ్మకాలు ఊపందుకున్నాయి.

కొన్నాళ్లు కనుమరుగు

మంచానికి పైభాగంలో పందిరి లాగా కరత్రో చేసిన ఫ్రేమ్‌ నిర్మిస్తే దానిని పందిరి మంచం అంటారు. వీటిని దోమ తెరలు బిగించడానికి లేదా శుభకార్యాల్లో అలంకరించడానికి ఉపయోగిస్తారు. పూర్వం దోమల నుంచి రక్షణకు దోమ తెరలు కట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. కేవలం నిద్రించడానికే కాకుండా ఇంటి అలంకరణలో స్టేటస్‌ సింబల్‌గా ఇది ఉండేది. ఇంటి ముందర వాతావరణం నుంచి రక్షణగా పందిరి ఎలా ఉంటుందో ఇంట్లో సౌకర్యవంతంమైన నిద్రకు రక్షణగా ఈ మంచంను డిజైన్‌ చేయడంతో దీనికి పందిరి మంచం అనే పేరు వచ్చింది. మడత మంచం, నవారు మంచం ఇలా అనేక రకాల మంచాలు ఉన్నప్పటికీ దీనికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటిది రాను రానూ ఇవి వాడుకలో లేకుండా పోయాయి. కొందరు పాత సామాన్ల వారికి అమ్మేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎక్కువ జాగా అవసరం కావడంతో ప్రస్తుత కాలంలో అతి తక్కువ జాగాలో ఎక్కువ మంది నివసించే పరిస్థితుల్లో వీటిని ఉపయోగించడం భారంగా భావించి వాడడం మానేశారు.

తయారీకి సెప‘రేటు’

డబుల్‌ కాట్‌ సింగిల్‌ కాట్‌ మంచాలు డిజైన్‌ బట్టి తయారు చేసే కర్రను బట్టి రేట్లు ఉండగా ప్రస్తుతం పందిరి మంచాలకు మాత్రం అధిక ధరలు పలుకుతున్నాయి. టేకు కర్రతో తయారు చేసే పందిరి మంచాలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది. మామూలు మంచాల కంటే ఎక్కువ కర్ర అవసరం అవుతుంది. పని కూడా పదితంలు ఎక్కువగా ఉండడంతో వీటి తయారీకి సొమ్ము గట్టిగానే ఖర్చవుతోంది. గతంలో నాణ్యమైన కర్రతో చేసిన పందిరి మంచాలు ఎలా ఉన్నాయో అదే రీతిలో ఇప్పుడు తయారు చేయిస్తున్నారు. వీటికితోడు కొత్త సొబగులు అద్దుకొని ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో పందిరి మంచాల అమ్మకాలు ఊపందుకోగా తయారీదారులు బిజీగా మారిపోయారు.

పట్టు పరుపునకే ప్రాధాన్యం

పందిరి మంచం పట్టు పరుపు ఒక కాంబినేషన్‌గా ఉంటుంది. ఇది పూర్వం నుంచి కొనసాగుతున్న ఒరవడి. అయితే కొంతకాలం నుంచి పరుపుల్లో అనేక రకాలు అందుబాటులోకి రావడంతో పట్టు పరుపులు కనుమరుగయ్యాయి. కేవలం బూరుగు దూదితో తయారు చేసే పట్టు పరుపులు కనిపించకుండా పోయాయి. కాని పందిరి మంచాల రాకతో మళ్లీ వీటికి జీవం వస్తోంది. పందిరి మంచం తయారు చేయించుకునే వారు దూది పరుపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ దూది పరుపుల తయారీ ప్రారంభమయ్యింది.

చిన్ననాడు అమ్మ పాడిన జోల పాటలు.. మనవడినో, మనవరాలినో నిద్రపుచ్చుతూ పక్కనే పడుకోబెట్టుకుని అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథలు.. మరెన్నో మరువలేని అనుభూతులు.. మధుర జ్ఞాపకాలకు ప్రత్యక్ష సాక్ష్యం.. పందిరి మంచం. పందిరి మంచం అంటే కేవలం నిద్రపోయేది కాదు.. అది ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞాపకాలను అందించే అద్భుతమైన సాధనం! టేకు కర్రతో చేసిన దృఢమైన కోళ్లు.. వాటిని నాలుగు వైపులా కలుపుతూ అమర్చిన బలమైన బద్దీలు.. వాటికి నలుమూలలా నగిషీలు చెక్కి, బిగించిన నాలుగు టేకు స్తంభాలు.. వాటిని కలుపుతూ మళ్లీ నాలుగు బద్దీలు.. వాటికి అందంగా వేలాడదీసిన తెరలు.. వెరసి రాజసం ఉట్టి పడే పాన్పు! అందుకే దీనికున్న ఆదరణ ‘చెక్క’ చెదరనిది!

క్రమంగా

డిమాండ్‌

ట్రెండ్‌ మారింది. పాత కాలపు అలవాట్లకు వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది. దానిలో భాగంగా కొన్నాళ్లు కనిపించని పందిరి మంచాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. జనం వీటిపై మక్కువ చూపడంతో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో పందిరి మంచాల తయారీ ఊపందుకుంది. ఎక్కువ మంది కొత్తగా పందిరి మంచాలను తయారు చేయిస్తున్నారు.

ట్రెండ్‌ మారింది

ఇప్పటి వరకు మామూలు మంచాలు మాత్రమే తయారు చేసేవాళ్లం. ఈ మధ్య చాలామంది పందిరి మంచాలు తయారు చేయమని ఆర్డర్లు ఇస్తున్నారు. పూర్వం ఉండే పందిరి మంచాలను పోలి ఉండి కొత్త డిజైన్లలో మంచాలు తయారు చేయమంటున్నారు. వీటి తయారీకి ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లేదు. ఒక్కో మంచం తయారు చేయడానికి రూ.1.50 లక్షలు ఖర్చవుతోంది. డిజైన్‌ను బట్టి రేటు పెరుగుతుంది. ఒక్కో మంచం తయారీకి నెల రోజులు పైగా సమయం పడుతోంది. ప్రతీ రోజు ఇద్దరు నుంచి నలుగురు పని చేయాల్సి ఉంటుంది. గతంలో అంతా చేతి పని కాగా ప్రస్తుతం మెషీన్లు అందుబాటులోకి రావడంతో కాస్త పని సులువుగా మారినా మంచం అంతా డిజైన్లతో ఉండడం వల్ల బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. పాలిష్‌కు ప్రాధాన్యం ఉండడంతో దానికే రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది.

– పట్నాల సీతాంబరం,

వడ్రంగి మేస్త్రి, కొత్తపల్లి

సై.. సై.. శయ్యారే!1
1/4

సై.. సై.. శయ్యారే!

సై.. సై.. శయ్యారే!2
2/4

సై.. సై.. శయ్యారే!

సై.. సై.. శయ్యారే!3
3/4

సై.. సై.. శయ్యారే!

సై.. సై.. శయ్యారే!4
4/4

సై.. సై.. శయ్యారే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement