జగ్గంపేటలో రూ.200 కోట్లకు పైగా అవినీతి | - | Sakshi
Sakshi News home page

జగ్గంపేటలో రూ.200 కోట్లకు పైగా అవినీతి

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

జగ్గంపేటలో రూ.200 కోట్లకు పైగా అవినీతి

జగ్గంపేటలో రూ.200 కోట్లకు పైగా అవినీతి

కిర్లంపూడి: జగ్గంపేట నియోజకవర్గంలో రూ.200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. బూరుగుపూడిలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ హయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అండదండలతో మామిడాడ, కృష్ణవరం, గండేపల్లి, మురారి, నాయకంపల్లి, బావాజీపేట, సూదికొండ, వేలంకతో పాటు అనేక గ్రామాల్లో మట్టి, ఇసుక అక్రమంగా తరలించి కోట్ల రూపాయాలు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి, అధిక లోడుతో వస్తున్న మట్టి, ఇసుక లారీలను కృష్ణవరం టోల్‌గేటు ద్వారా కాకుండా కృష్ణవరం గ్రామం నుంచి పోలవరం కాలువ గట్టు ద్వారా బూరుపూడికి మళ్లిస్తున్నారని అన్నారు. దీనికి వ్యక్తిగత టోల్‌గేటు ఏర్పాటు చేసుకుని, వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని, స్థలం, సమయం, తేదీ చెప్తే, అక్కడకు వెళ్లి, అవినీతిని బయటపెడతానని సూర్యచంద్ర సవాల్‌ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే ఆ సమావేశంలోనే వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement